నమస్తే శేరిలింగంపల్లి: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధమని, ప్లాస్టిక్ కవర్లను విక్రయించిన వ్యాపారులకు జరిమానా తప్పదని చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుదాంష్ అన్నారు. కేంద్రప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన నిషేధం విధించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చందానగర్ సర్కిల్ లో అమ్మకం దారులు, వ్యాపారులు, వినియోగదారులకు పారిశుద్ధ్య విభాగం, ప్రాజెక్టు విభాగం ద్వారా శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సర్కిల్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనర్ సుధాంష్ నందగిరి అధికారులు, సిబ్బంది తో కలిసి పర్యటించి అవగాహన, హెచ్చరిక కార్యక్రమాలు చేశారు. సింగిల్ యూజ్ ప్లాసిక్ క్యారీ బ్యాగులు, ఇయర్ బడ్స్ లోని ప్లాస్టిక్ స్టిక్, బలూన్స్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, చాక్లెట్ ప్లాసిక్ పుల్లలు, ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ పుల్లలు, థర్మకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, చెంచాలు, ఫోర్కులు, స్త్రాలు, ప్లాస్టిక్ ప్యాకింగ్ పేపర్లు, ప్లాస్టిక్ బ్యానర్లు తదితర నిషేధిత జాబితాలోనివి వాడొద్దని అవగాహన కల్పించారు. అవగాహనా కార్యక్రమాలు ముగిశాక నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఉత్పత్తిదారులు, అమ్మకందారులు, వినియోగదారులు పర్యావరణ హితం కొరకు సహకరించాలని కోరారు.