నమస్తే శేరిలింగంపల్లి: చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి కనబరిచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపులో భాగంగా స్పోర్ట్స్ క్విజ్ నిర్వహించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా క్విజ్ లో పాల్గొని క్రీడా సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. క్రీడల వలన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. అనంతరం జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ లో క్వీజ్ తో పాటు, టెన్నిస్, బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి జోన్ గేమ్స్ ఇన్‌స్పెక్టర్ వీరానంద్ తదితరులు పాల్గొన్నారు.