శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం కేటాయించిన అసైన్‌డ్ భూములు, అలాగే అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూములు ఆక్రమించబడుతున్నాయని గ్రామస్థులు సయ్యద్ షకీల్, సయ్యద్ అజమ్ , సయ్యద్ తోఫిక్, రామకృష్ణ తదితర ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. 1961వ సంవత్సరంలో బలహీన వర్గాలకు కేటాయించిన భూములు చట్టపరంగా ఇతరులకు బదిలీ చేయరాదని నియమాలు ఉండగా, ప్రస్తుతం వాటిపై ఆక్రమణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదు చేస్తున్న వారిలో కొందరు అసలు లబ్ధిదారుల వారసులు (SC, BC, మైనారిటీలు) కాగా, ఖానామెట్ గ్రామ ప్రజలు, సామాజిక కార్యకర్తలు కలిసి ఈ అంశాన్ని ప్రజాహిత దృష్ట్యా ముందుకు తీసుకువచ్చారు.

అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి విస్తృత స్థాయిలో అసైన్‌డ్, ULC భూములను ఆక్రమిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణకు గురైనట్లు సమాచారం. సంబంధిత భూములను కాపాడాలని, ఇంకా కొంతమంది రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో ఉన్నవారు, ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ఆర్థిక లాభాలు పొందుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే తగిన ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు. సాధారణ ప్రజలకు మాత్రం నోటీసులు జారీ చేస్తూ, ప్రభావశీలులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వివక్షాత్మకంగా ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఖానామెట్ గ్రామంలోని అసైన్‌డ్, ULC భూముల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అసలు లబ్ధిదారులకు భూములు తిరిగి అప్పగించాలని ఫిర్యాదుదారులు ప్రభుత్వాన్ని కోరారు.





