శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అత్యంత ఘనంగా జరగబోయే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని శేరిలింగంపల్లి భారాస సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఛలో వరంగల్.. జై కేసీఆర్ అంటూ రాసిన వాల్ రైటింగ్స్ లో స్వయంగా పాల్గొన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రతిఒక్కరిని కోరుతున్నానని వెల్లడించారు. తెలంగాణ కోసం నిరంతరం పోరాడే పార్టీగా భారాసకు ప్రజల గుండెల్లో నిలిచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావన్నారు.
బంగారు తెలంగాణను నాశనం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసే నిరంకుశ పాలనపై భారాస పోరాటం చేస్తుందన్నారు. ఈ నెల 27న నిర్వహించబోయే సభతో ప్రభంజనం సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ జనంలోకి రాక కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. అధికారంలో భారాస లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం అనునిత్యం ఆలోచించే పార్టీ భారాస మాత్రమేనన్నారు. జాతీయ పార్టీలకు తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉండదని వెల్లడించారు. తెలంగాణ కోసం ఏర్పడిన భారాస రజతోత్సవ సభను విజయవంతం చేసి.. కాంగ్రెస్ పై పోరుబాటకు సిద్ధం కావాలని రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు.