శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య అని, ఉగ్రమూకల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పహల్‌గామ్ మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన సంతాపం తెలియజేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జమ్ముకాశ్మీర్ పహల్గాం లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య అని, ఉగ్రదాడి అమానుషం అని, జరిగిన సంఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు. ఉగ్రవాదులను ఉపేక్షించే ప్రసక్తే లేదని, పలు ప్రాంతాల నుంచి వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు. ఈ దుశ్చర్య సంఘటనపై దిగ్భ్రాంతి, తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. టెర్రరిస్టుల మారణకాండ ఇకపై పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.