చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తాయని చందానగర్ డివిజన్ తెరాస అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని చందానగర్, తారానగర్, శాంతి నగర్, ఇందిరానగర్ లలో శనివారం ఆమె ఇంటింటికీఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయంలో మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీ అసోసియేషన్ లు, మహిళలు, యువత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. కాలనీ ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల సహకారంతో డివిజన్ లో పెద్దఎత్తున మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. నాయీ బ్రాహ్మణుల షాపులకు, లాండ్రీ షాపులకు విద్యుత్ ఛార్జీలను రద్దు చేయడం జరిగిందన్నారు.
వానాకాలంలో ఊసిళ్ళు వచ్చినట్లు ఎన్నికలు రాగానే బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఓట్ల కోసం వస్తారని ఆమె విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంటే, బిజెపి నాయకులు అరాచక హైదరాబాద్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ధ్వజ మెత్తారు. పేదలకోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్, రైతుబంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గురుచరణ్ దూబే, ఉరిటి వెంకట్ రావు, ఓ.వేంకటేష్ రాజు, మిరియాల రాఘవరావు, సునీత రెడ్డి, ధనలక్ష్మి, లక్ష్మినారాయణ గౌడ్, రవీందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, యాదగిరి గౌడ్, రాంచందర్, కరుణాకర్ గౌడ్, రఘుపతి రెడ్డి, మిరియాల ప్రీతమ్, అక్బర్, అంజద్ పాల్గొన్నారు.