శేరిలింగంపల్లి, మే 24 (నమస్తే శేరిలింగంపల్లి): మన భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాదు, మంచి ఆరోగ్యం, ప్రశాంత జీవితం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆరోగ్య శేరిలింగంపల్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ సాయి ఎనక్లేవ్ కాలనీలో రూ.23 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌తో పటు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవిడుపు పరికరాలను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కృష్ణ సాయి కాలనీలో ఓపెన్ జిమ్ ప్రారంభించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చే పిల్లలు, పెద్దలు, వృద్ధులకు ఈ ఓపెన్ జిమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కాలనీ వాసులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే పిల్లల కోసం ప్రత్యేక ఆటస్థలాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని గాంధీ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మరిన్ని కాలనీల్లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పేర్కొంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని గాంధీ సూచించారు. మియాపూర్ డివిజన్‌లోని పార్కులను అన్ని హంగులతో అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం ద్వారా పిల్లలు, పెద్దలు సులభంగా వాకింగ్ చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పార్క్ చుట్టూ మెష్ ఏర్పాటు చేయడంతోపాటు భూమిని చదును చేసి మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





