అంజయ్య నగర్‌లో బస్తీ బాట.. సమస్యలపై రవికుమార్ యాదవ్, కెఎస్ రత్నం పరిశీలన

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అంజయ్య నగర్ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు అంజయ్య నగర్, బంజారా బస్తీల్లో పర్యటించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు పరిశీలించారు. అనుమతులు లేకుండా 7, 8 అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, ప్రతిరోజూ డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రభుత్వ అధికారులు, శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని రవికుమార్ యాదవ్, కెఎస్ రత్నం హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలు తమ సమస్యలను బీజేపీ నాయకులు, కార్యకర్తల దృష్టికి తీసుకువస్తే, వాటిపై ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బస్తీ బాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. అనంతరం అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్ ప్రాంతాల్లోని రేషన్ షాపులను నాయకులు పరిశీలించారు. రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యం వాటా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం అందిస్తోందని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటాను ప్రజలకు తెలియజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆరు కిలోల బియ్యాన్ని తామే అందిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను రేషన్ షాపులు, రేషన్ కార్డులపై ప్రదర్శించకుండా ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు మాత్రమే ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని రవికుమార్ యాదవ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్ రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటోతో పాటు ప్రభుత్వాల వాటాలను వివరించే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇకపై శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లోని బస్తీలు, కాలనీల రేషన్ షాపుల వద్ద కేంద్ర ప్రభుత్వ వాటాను తెలియజేసే బోర్డులు, ప్రధాని మోదీ ఫొటోలను ఏర్పాటు చేయాలని బీజేపీ శ్రేణులకు రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రవి నాయక్, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు సాగర్, సంతోష్ కుమార్, మన్యం కొండ సాగర్, సరోజ రెడ్డి, ఆమని, సాగర్, వెంకటేష్, కిషన్, క్రాంతి, ధనరాజ్, మోహిత్, శంకర్, సంజీవ్, చందు తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here