సురభి యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ.. వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్ ప్రారంభం..

శేరిలింగంపల్లి, మే 25 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలుగు నాటకరంగంలో విశిష్ట స్థానం సంపాదించిన సురభి కుటుంబాల యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన 15 రోజుల వాయిస్ అండ్ స్పీచ్ వర్క్‌షాప్ ను శేరిలింగంపల్లి ప్రారంభించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సురభి కళాక్షేత్రమ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమం సురభి యువసేన భవనంలో ప్రారంభమైంది. 140 ఏళ్లకు పైగా కళను జీవనాధారంగా చేసుకుని నాటకరంగ సేవలో కొనసాగుతున్న సురభి కుటుంబాల యువతకు రంగస్థల నైపుణ్యాలతోపాటు ఆధునిక కమ్యూనికేషన్ స్కిల్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. వర్క్‌షాప్ డైరెక్టర్ డా. రమేష్ సింధే పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగనుంది.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం నటన మాత్రమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలగడం, భావాలను సమర్థంగా వ్యక్తపరచగలగడం ఎంతో అవసరమని తెలిపారు. సురభి యువతకు సహజసిద్ధంగా ఉన్న వాయిస్ స్పష్టత, హావభావాలకు ఆధునిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు జోడిస్తే వారు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని అభిప్రాయపడ్డారు. ఈ వర్క్‌షాప్ నిర్వహణకు సహకారం అందించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. ఏనుగు నరసింహా రెడ్డికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సురభి కాలనీవాసుల సంక్షేమ సంఘం అధ్యక్షుడ‌ అవేటి శేఖర్, ఆర్. వెంకట్ రెడ్డి, ప్రముఖ కవి, రచయిత వనారస శ్రీనివాస్, సురభి యువసేన అధ్యక్షుడు ఆర్. పూజిత్ సాయి, మాజీ అధ్యక్షుడు వనారస చిరంజీవి పాల్గొన్నారు.

అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఇలాంటి వ్యక్తిత్వ వికాస శిబిరాల్లో పాల్గొనడం ద్వారా భవిష్యత్తులో ఏ రంగంలోనైనా రాణించగలరని పేర్కొన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో బ్రీత్ టెక్నిక్స్, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, పబ్లిక్ స్పీకింగ్, స్క్రిప్ట్ రీడింగ్ వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో సురభి యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here