నమస్తే శేరిిలింగంపల్లి: మియాపూర్ లోని ఓంకార్ నగర్ లో కనీస మౌలిక వసతులు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓంకార్ నగర్ కాలనీ వాసులు వాపోయారు. ఈ మేరకు ఎంసీపీఐ (యూ) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చందానగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐ (యూ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ మాట్లాడుతూ ఓంకార్ నగర్ లో గత 30 సంవత్సరాలుగా మున్సిపల్, జిహెచ్ఎంసి పరిధిలోనీ అనేక బస్తీలలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్న కార్మికులు, జీవనోపాధి కోసం వివిధ వృత్తులు చేసుకుంటూ చిన్నపాటి నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారన్నారు. కనీస మౌలిక వసతులైన నీరు, డ్రైనేజీ , వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఓంకార్ నగర్ ని నోటిఫైడ్ స్లిమ్ గా గుర్తించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి ఇంటి నెంబరు కేటాయించాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,సి.సి రోడ్లు,వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, నీటి సమస్యను పరిష్కరించాలని, భారత ప్రభుత్వం కల్పిస్తున్న పథకంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లను కట్టించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలలో ఓంకార్ నగర్ వాసులను భాగస్వాములు చేసి ప్రతి పథకాన్ని వర్తించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కాలనీ వాసులు ఏఎంసీ సుదీర్ చంద్రకు వినతి పత్రం అందజేశారు.