- 42 కుటుంబాలకు రూ.63 వేల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ…
నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కష్టకాలంలో ఆశ్రీ సొసైటీ వారు అందించిన సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కోవిడ్ వల్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన శేరిలింగంపల్లి పరిధిలోని 42 కుటుంబాలకు ఆశ్రీ సొసైటీ వారు చేయూతనందించారు. సదరు కుటుంబాలకు రూ.63 వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రభుత్వవిప్ గాంధీ చేతుల మీదుగా బాదిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కరోనా బాదిత కుటుంబాల ఆకలి తీర్చేందుకు ఆశ్రీ సొసైటీ ఫౌండేషన్ ఛైర్మెన్ పూర్ణిరామకిశోర్ రెడ్డి పెద్ద మనస్సుతో ముందుకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆశ్రీ సొసైటీ వారిని ఆదర్శంగా తీసుకొని సేవ దృక్పదంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లు సైతం ఎంతగానో ఉపయోగపడుతున్నాయని గాంధీ అన్నారు.
ఆశ్రీ సొసైటీ నిర్వాహకురాలు పూర్ణీరెడ్డి మాట్లాడుతూ కారణం ఏదైనా అభాగ్యులుగా, అనాధలుగా మారిన వారికి ఆశ్రీ సొసైటీ ద్వారా చాలా కాలంగా తోచిన సహకారం అందిస్తూ వస్తున్నామని అన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. మేము అందిస్తున్న సేవలకు ఎంతో మంది తోడ్పాటును అందిస్తున్నారని, వారందరకి సదా రుణపడి ఉంటామని అన్నారు. సేవ చేయాలనే మనసు ఉండి సమయం లేని వారు, సరైన వేధిక లేదని ఆలోచించే వారు ఆశ్రీ సొసైటీతో భాగస్వాములు కావచ్చునని, ధన రూపంలో, వస్తు రూపంలో సహాయ సహకారాలు అందిచవచ్చని అన్నారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్ 9293414444లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి మోతి, డీసీపీఓ ప్రవీణ్, ఏసీడీపీఓ హర్ష వర్ధిని, సీడీపీఓ లక్ష్మీబాయి, సూపర్ వైజర్లు జ్యోతి శ్రీ, విజయ, రేణుక, అంగన్ వాడి ఉపాధ్యాయులు, మాదాపూర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అమల, శశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.