- సగరుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం: శేఖర్ సగర
మెదక్ (నమస్తే శేరిలింగంపల్లి): మెదక్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా ఉప్పరి ఓంకార్ సగర ఎన్నికయ్యారు. మంగళవారం ఏడుపాయలలో రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన జరిగిన ఎన్నికల సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా ఉప్పరి ఓంకార్ సగర, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశం సగర, కోశాధికారిగా సందిల్లా సాయిలు సగర, గౌరవాధ్యక్షుడిగా రవీందర్ సగరలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సగరుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. కులవృత్తి నిర్మాణ రంగం పై ఆధారపడిన సగర జాతికి ఆర్థికంగా చేయూతనందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కులవృత్తుల పై ఆధారపడిన కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయింపులు చేశాయని, కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయించడం లేదని అన్నారు. సగరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సగర కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కోకాపేట స్థల సమస్య పరిష్కరించి తమకు కేటాయించిన భూమిని తమకు అప్పగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాములు సగర, సంయుక్త కార్యదర్శులు దత్తాత్రేయ సగర, దామోదర సగర, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పెద్దబుద్దుల సతీష్ సగర, ప్రధాన కార్యదర్శి మర్క సురేష్ సగర పాల్గొన్నారు.