నమస్తే శేరిలింగంపల్లి: బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన గొప్ప నాయకులు, పేద ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ ఎన్టీఆర్ అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జె పి నగర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా అటు చలన చిత్రసీమకు, ఇటు నిరుపేదల పాలిట ఆత్మబంధువుగా, తెలుగునాట రాజకీయ చైతన్యాన్ని రగిలించిన నాయకులు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు దూరమై ఇన్నేళ్లవుతున్నా నేటికి మన కళ్ళముందే కదులాడుతున్నట్టు ఉందన్నారు. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్ కు మనం అందించే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా కృష్ణ రావు, కోటేశ్వరరావు, మురళి కృష్ణ, రామకృష్ణ, అప్పారావు, శ్రీధర్, ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
