నమస్తే శేరిలింగంపల్లి: ప్లాస్టిక్ వాడకంతో భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ జేపీ నగర్ లోని సంస్కృతి స్కూల్ లో ఏర్పాటు చేసిన నో ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకం మానవాళి జీవనానికి, భూమికి ప్రమాదకరమని తెలియజేస్తూ నిర్వహించిన ర్యాలీని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం మానవాళి మనుగడకు ప్రమాదకరమని అన్నారు. ప్లాస్టిక్ బ్యాగులను, కవర్ల వాడకాన్ని నివారించి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగ్స్, పేపర్ కవర్స్, క్లాత్ కవర్స్ ను వాడాలన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకంతో వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, పచ్చని ప్రకృతి అంతరించి వాయు కాలుష్యం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. మనిషి జీవన విధ్వంసానికి కారణమవుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించటంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి ప్రకృతిని కాపాడుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, వినోద్ యాదవ్, మోహన్, స్కూల్ డైరెక్టర్ సురేష్, ప్రిన్సిపల్ వినూత్న, తృప్తి, వాణి మహేష్ తదితరులు పాల్గొన్నారు.