శేరిలింగంపల్లి, ఆగస్టు 31 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ప్లాట్ నం.45 ఎదురుగా 120 గజాల్లో యథేచ్ఛగా చేపడుతున్న 5 అంతస్తుల అక్రమ నిర్మాణంపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మియాపూర్ సర్కిల్ ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు స్థలంలో ఏకంగా 5 అంతస్తుల నిర్మాణాన్ని చేపడుతున్నారని, అంత తక్కువ ప్రదేశంలో అన్ని అంతస్తులకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది, రాజకీయ నాయకులకు ఫ్లోర్‌కు రూ.2 లక్షల చొప్పున ముడుపులు చెల్లించి యథేచ్ఛగా నిర్మాణం చేపడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై ఈ దందా చేస్తున్నారా అని ఆరోపించారు. ఓ వైపు హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూనే, మరో వైపు ఇలాంటి నిర్మాణాలను ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే చెయిన్మెన్, టీపీఎస్, ఏసీపీ తదితర అధికారులను సస్పెండ్ చేసి ఉన్నతాధికారులు తమ నిజాయితీని నిరూపించుకోవాలని జనం కోసం డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు.







