శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై భద్రతా సిబ్బంది (హోంగార్డు) దాడికి పాల్పడిన ఘటనపై మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి తీవ్రంగా స్పందించారు. మహిళను నడిరోడ్డుపై విచక్షణారహితంగా కొట్టడం, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు. కలిదిండి రోజా, మమతతో కలిసి ఘటనను ఖండించిన నవతారెడ్డి.. మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత, గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రజలకు అండగా నిలవాల్సిన భద్రతా వ్యవస్థలోని వ్యక్తే విచక్షణ కోల్పోయి మహిళపై దాడికి పాల్పడటం ఆందోళనకరమని నవతారెడ్డి అన్నారు. మహిళను జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన దృశ్యాలు సభ్యసమాజాన్ని కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న పాలకులు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో ఎందుకు కఠిన పర్యవేక్షణ చేపట్టడం లేదని నిలదీశారు.

మహిళల రక్షణపై ప్రభుత్వం కేవలం ప్రకటనలు, హామీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో భద్రతను కల్పించాలని నవతారెడ్డి డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారులపై మహిళలు నిర్భయంగా సంచరించేలా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హఫీజ్పేట్ ఘటనతో భద్రతా వ్యవస్థపైనే ప్రజల్లో భయం, ఆందోళన ఏర్పడే పరిస్థితి ఉందని అన్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు. కారణం ఏదైనా మహిళపై ఇంతటి భౌతిక దాడిని సమర్థించలేమని నవతారెడ్డి అన్నారు. బాధ్యుడైన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు, రైల్వే భద్రతా సిబ్బందికి ప్రజలతో, ముఖ్యంగా మహిళలతో హుందాగా వ్యవహరించేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు.

విధి నిర్వహణలో సిబ్బంది సంయమనం పాటించేలా ఉన్నతాధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఈ ఘటనను కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పుగా చూడకుండా వ్యవస్థాగతంగా మార్పులు తీసుకురావాలని బొబ్బా నవతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





