శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC ప్రధాన కార్యాలయం లో చీఫ్ సిటీ ప్లానర్( సీసీపీ) శ్రీనివాస్ ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, లింక్ రోడ్డుల అభివృద్ధి పై చర్చించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రోడ్లు, లింక్ రోడ్లకు , రోడ్ల విస్తరణ పనులకు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సాంకేతిక ప్రాసెస్ త్వరితగతిన జరిగేలా చూడాలని కోరారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసే విధంగా ప్రజల మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం మరిన్ని లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని, స్థల సేకరణ జరిగి పెండింగ్ లో ఉన్న లింకు రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని సీసీపీ శ్రీనివాస్ దృష్టికి PAC చైర్మన్ గాంధీ తీసుకువచ్చారు. అలాగే శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, JNTU నుండి ప్రగతి నగర్ వరకు రోడ్డు విస్తరణ , ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు చేపట్టాలని, అపర్ణా హిల్ పార్క్ నుండి గంగారాం చెరువు వద్ద హనుమాన్ దేవాలయం వద్ద జాతీయ రహదారికి కలిపే లింక్ రోడ్డు పనులు చేపట్టాలని, HMT స్వర్ణపురి నుండి PJR ఎనక్లేవ్ వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.
నల్లగండ్ల నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ వరకు కలిపే లింక్ రోడ్డును నిర్మించాలని, మియాపూర్ ప్రధాన రహదారి నుండి కల్వరి టెంపుల్ మీదుగా విజ్ఞాన్ స్కూల్ వరకు కలిపే ఫ్లై ఓవర్, లింక్ రోడ్డు పనులు ప్రారంభించాలని, ముంబాయి జాతీయ రహదారి మై హోమ్ జ్యూవెల్ నుండి వయా రైల్వే ట్రాక్ మీదుగా జోనల్ కార్యాలయం కు కలిపే ఫ్లై ఓవర్, లింక్ రోడ్డు పనులు త్వరితగతిన చేపట్టాలని కోరారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ లింక్ రోడ్డు పనులు చేపట్టాలని అన్నారు. దీనికి సీసీపీ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వెంటనే పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలియచేసారు. సకాలంలో రోడ్లు, లింక్ రోడ్లు, అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులు పూర్తి అయ్యేలా చూస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అసంపూర్తిగా మిగిలిపోయిన లింక్ రోడ్ల పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని సీసీపీ శ్రీనివాస్ తెలియచేసారు.