శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ A. P. J. అబ్దుల్ కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు M. బసవలింగం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య S. సుధాకర్ బాబు మాట్లాడుతూ భారతరత్న అబ్దుల్ కలాం జన్మదినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అందుకు కారణం విద్య పట్ల ఆయనకు ఉన్న లోతైన నిబద్దత, విద్యార్థులతో ఆయనకు ఉన్న అనుబంధమేనని అన్నారు. సమాజంలో విద్యార్థుల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామని అన్నారు. భారతదేశ 11వ రాష్ట్రపతిగా, భారత అంతరిక్ష, సైనిక పరిశోధనల పురోగతికి గణనీయమైన కృషి చేసిన అత్యుత్తమ విద్యా వేత్తలలో కలాం ఒకరని అన్నారు. భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. చేతి రాత బాగుండాలి. నిత్యం పుస్తక పఠనం చేయాలి. విద్య తోనే జ్ఞానం, ధైర్యం కలుగుతాయి. అప్పుడే మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి విజయం సాధించగలుగుతాం. అదే మనం కలాంకి అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధుసూదన్ రెడ్డి, నరోత్తమ రెడ్డి, చంద్రశేఖర్, మంగ, రోజమ్మ, విద్యార్థిని, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వరరావు, శివరామకృష్ణ, విష్ణుప్రసాద్, జనార్ధన్, పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.






