నమస్తే శేరిలింగంపల్లి: వారణాసిలో నవంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో రంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటి పతకాలు కైవసం చేసుకున్నారు. చందానగర్ పీజేఆర్ స్టేడియం లో శిక్షణ పొందిన నలుగురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మానసపతి 35 ప్లస్ హామర్ త్రో క్రీడా విభాగంలో, జితేందర్ పటేల్ 50 ప్లస్ ట్రిపుల్ జంప్ లో కాంస్య పతకాలను సాధించారు. జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో 21 రాష్ట్రాలకు చెందిన 1869 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి జ్యోతి, సమీర్, సుల్తానా, ఏసురత్నం, వేణుగోపాల్, శిషిర్డ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీడాకారులు పాల్గొని రెండు కాంస్య పతకాలు సాధించడం పట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ హర్షం వ్యక్తం చేశారు. కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు, జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు జిల్లా అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.