నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలంలో సీపీఐ పార్టీని వ్యవస్థాపించిన నాటి నుండి చివరిదాకా కమ్యూనిస్టు పార్టీలో అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన కామ్రేడ్ రక్తపు నగేష్ గౌడ్ సేవలు మరవలేనివని సిపిఐ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి టి రామకృష్ణ గుర్తు చేశారు. రక్తపు నగేష్ గౌడ్ 61వ జయంతి ని ఖానామెట్ సీపీఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. సీపీఐ మండల కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ 1995 లో శేరిలింగంపల్లి మండలంలో సీపీఐ పార్టీ తరపున వలస కార్మికులను చేరదీసి ఇంటి స్థలాల కోసం పోరాడిన వ్యక్తి నగేష్ గౌడ్ అని అన్నారు. ఎన్నో బస్తీ లను నెలకొల్పిన చరిత్ర నగేష్ గౌడ్ ది తెలిపారు. కార్మిక రంగంలో పనిచేస్తున్న వారి కోసం ఏఐటీయూసీ యూనియన్ ఏర్పాటు చేసి వారి హక్కుల పై ఎన్నో ఉద్యమాలు చేసిన నాయకుడని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక ఉద్యమాలపై నిరంతరం పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాలను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎన్నో ఉద్యమాలు చేసే నాయకుడు ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్తపు వినయ్ గౌడ్, కె నరసింహా రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కె. చందు యాదవ్, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. కాశీ, ఇజ్జత్ నగర్ కార్యదర్శి టి.కృష్ణ, రవి, ఎం వెంకటేష్, ఎన్నార్ బిట్టు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
