‘నాన’ కలం పేరుతో శతాధిక పద్యాలు రచించిన నర్సింహులుకు జాతీయ పురస్కారం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న తెలుగు అధ్యాపకులు నర్సింహులు సర్థార్ వల్లాభాయ్ పటేల్ స్మారక జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం నారాయణపూర్ కు చెందిన ఎం. నర్సింహులు గతంలో తాండూర్ పట్టణం, పెద్దెముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. మణిపూసల ప్రక్రియలో ‘నాన’ (నానాపురం నర్సింహులు) పేరుతో శతాధిక పద్యాలు రచించినందుకు సాహితీ విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఆదివారం హైదరాబాద్‌ లో పుడమి సాహిత్య వేదిక నల్లగొండ ఆధ్వర్యంలో నిర్వహించిన‌ కార్యక్రమంలో సర్థార్ వల్లాభాయ్ పటేల్ స్మారక జాతీయ పురస్కారాన్ని సంస్థ అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి చేతుల మీదుగా నర్సింహులు అందుకున్నారు.

జాతీయ పురస్కారానికి ఎంపికైన నానాపురం నర్సింహులు

ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ నాన అనే కలం పేరుతో శతాదిక పద్యాలు రాసిన నర్సింహులు అభినందనీయులని అన్నారు. పలు‌ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధక పత్రాలను సమర్పించారని అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి తెలుగు భాషా సాహిత్యంపై నర్సింహులు ఉచిత శిక్షణనిచ్చి మెటీరియల్ ను సైతం అందజేశారని అన్నారు. వికారాబాద్ జిల్లా భాష- పరిశీలన అంశంపై నర్సింహులు పీహెచ్‌డీ చేస్తున్నారని, ఈ అవార్డుకు ఎంపికవడం గర్వంగా ఉందని అన్నారు. అవార్టు గ్రహీత నర్సింహులు మాట్లాడుతూ తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ఈ అవార్డుకు ఎంపికవడం పూర్వజన్మసుకృతమని అన్నారు. తెలుగు భాషపై, సాహిత్యంపై అందరిలోనూ అవగాహన కల్పించేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జానపద గాయని దాస శ్రీ లక్ష్మీ, విద్యావేత్త పొద్దుటూరి ఎల్లారెడ్డి, పుడమి సాహితీ వేదిక గౌరవాధ్యక్షులు ముదిగంటి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి బూరుగు గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ పురస్కారాన్ని అందుకుంటున్న నర్సింహులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here