శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలవాలని కూకట్పల్లి మండల విద్యాధికారి రవీందర్ రాజు అన్నారు. యూత్ ఫర్ సేవా, ఓ సాఫ్ట్వేర్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కూకట్పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఎంఈఓ రవీందర్ రాజు ఆధ్వర్యంలో సుమారు 400 మంది విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేయూత అందించడం అభినందనీయమన్నారు. యూత్ ఫర్ సేవా వంటి సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు.

స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని రవీందర్ రాజు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా ప్రతినిధులు, సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





