శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ మక్తా మహబూబ్‌పేట్‌లోని 44 సర్వే నంబర్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రామోస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో సిఎంసీ కమిషనర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, మియాపూర్ సర్కిల్-48 డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సీసీపీ, సీపీ, ఏసీపీలకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ, సిఎంసీ అధికారులు సీజ్ చేసిన భవనాలకు ఏర్పాటు చేసిన సీలింగ్ బోర్డులను తొలగించి తిరిగి నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

అధికారులు షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని, సీజ్ చేసిన భవనాలపై కూడా తదుపరి చర్యలు తీసుకోవడం లేదని సంతోష్‌రెడ్డి ఆరోపించారు. బిల్డర్లకు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలకు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల అంజయ్యనగర్‌లో నాణ్యత లేని నిర్మాణం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనను ప్రస్తావించిన ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

అనుమతులు లేకుండా, నాసిరకం నిర్మాణాలు చేపడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారులను గుర్తించి సస్పెండ్ చేయాలని సంతోష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. 44 సర్వే నంబర్లో అనుమతులు లేని భవనాలను ప్రజలు కొనుగోలు చేయవద్దని ఆయన సూచించారు. అక్రమ నిర్మాణాల్లో ఇళ్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.





