నమస్తే శేరిలింగంపల్లి: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నా పలు పరీక్షా కేంద్రాల వద్ద కనీస మౌలిక వసతులు కల్పించలేదనే విషయం తేటతెల్లమవుతోంది. కనీసం పారిశుద్ధ్య సమస్యను సైతంపరిష్కరించక పోవడంతో చెత్తాచెదారం వల్ల దుర్గందపూరితమైన వాసన వెదజల్లుతోంది.
చందానగర్ శ్రీదేవి థియేటర్ సమీపంలోని జవహర్ నగర్ న్యూ నేషనల్ హై స్కూల్ పరీక్షా కేంద్రం వద్ద చెత్తాచెదారం పడి ఉండడంతో ముక్కుపుటాలు పగిలిపోయేలా దుర్వాసన వెదజల్లుతోంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఏర్పాట్లపై ముక్కు విరుస్తున్నారు. పరీక్షా కేంద్రంలో ఓ వైపు మాస్క్ ధరించి మరో వైపు ముక్కు మూసుకొని పరీక్షలు రాయాల్సిన దుస్థితి నెల కొందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పేరుకుపోయినా చెత్తాచెదారాన్ని తొలగింపజేసి ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని సూచిస్తున్నారు.