నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయ రజతోత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి దివ్యాశీస్సులతో ఐదు రోజుల పాటు హరిహరుల వైభవోత్సవాలు అంబరాన్నంటాయి. చివరి రోజున బంగారు తాపడంతో చేసిన ధ్వజ స్తంభాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తర పీఠాధీశులు స్వాత్మానందేంద్ర స్వామీలు ఆవిష్కరించారు. అదేవిధంగ శ్రీభూవరాహస్వామి శిలావిగ్రహ, పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఐదు రోజులు చండీ యాగం మహా పూర్ణాహుతి నిర్వహించారు.
ఆలయ ప్రధానార్చకులు, కమిటీ సభ్యులకు స్వామీజీల ఆశీస్సులు…
ఉత్సవాల విజయవంతంలో ప్రధాన భూమిక పోషించిన ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి ఆచార్యులు దంపతులకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తర పీఠాధీశులు స్వాత్మానందేంద్ర స్వామీలు బంగారం ఉంగరం బహూకరించి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్ల రఘుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు, అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుభాష్, కోశాధికారి అశోక్ కుమార్, ఉపకార్యదర్శి దేవేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకట శేషయ్య, నాగేశ్వరరావు, బ్రహ్మయ్య గుప్త, రాం గోపాల్, బచ్చు శ్రీకాంత్, ఆలయ మహారాజ పోషకులు కలిదిండి సత్యనారాయణ రాజు, జాన్సీలక్ష్మీ దంపతులతో పాటు దాతలను స్వామీజీలు ఘనంగా సత్కరించారు.
విశాఖ శారదా పీఠపాలిత దేవాలయాల్లో చందానగర్ వెంకటేశ్వరాలయం ప్రధానమైంది: స్వామి స్వరూపానందేంద్ర
ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి మాట్లాడుతూ విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఆలయాల్లో చందానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రధానమైనదని అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే భక్తులకు జగన్మాత రాజశ్యామల అమ్మవారే గుర్తుకొస్తారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టదైవం రాజశ్యామల అమ్మవారని వివరించారు. అలాంటి అమ్మవారికి చందానగర్‌లో యాగం నిర్వహించడం ఇక్కడి భక్తులకు ఆశీర్వచనీయమని అన్నారు.