నమస్తే శేరిలింగంపల్లి: శానిటేషన్ పై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో శానిటేషన్, వ్యాక్సినేషన్, ఇంజనీరింగ్, ట్యాక్స్, టౌన్ ప్లానింగ్ విభాగాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మీ మాట్లాడుతూ శానిటేషన్, టాయిలెట్స్ నిర్వహణ పై సర్కిల్ సహాయ వైద్య అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలని శానిటేషన్ వర్కర్స్ హాజరు, టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉందో లేవో తరుచూ పరిశీలించాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్, థీమ్ పార్క్ ఇతర పనులలో కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. దోమల నివారణకు చర్యల్లో భాగంగా ఫాగింగ్, స్లమ్ ఏరియాల్లో దృష్టి సారించాలని వారం వారం నిర్దేశించిన ప్రదేశాలలో ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ గా గుర్తించిన పెద్ద పెద్ద వ్యాపారస్తుల పై దృష్టి సారించాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇంజనీరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, పూర్తయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వెంటనే ప్రారంభించేంలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన ప్రకారంగా టాక్స్ వసూలు చేయాలన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. స్ట్రీట్ లైట్ల విషయంలో ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించాలని అన్నారు. శానిటేషన్, స్ట్రీట్ లైట్ అంశాల పై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. వచ్చే సంవత్సరం జనవరి నుండి ప్రతి శుక్రవారం గ్రీన్ డే గా పాటిస్తామని చెప్పారు. జోన్ లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని 8 లింక్ రోడ్లను చేపట్టడం జరిగిందన్నారు. జాతీయ రహదారి, ముంబై హై వే నుండి వచ్చే ట్రాఫిక్ శేరిలింగంపల్లి నుండి మెహదీపట్నం వెళ్లే ట్రాఫిక్ ను లింకు రోడ్ల ద్వారా మళ్ళించే అవకాశం ఉందన్నారు. జోన్ లో చేపట్టిన 485 టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. 100 శాతం వాక్సినేషన్ పూర్తవ్వాలని ఇంటింటికి సర్వే చేసి వ్యాక్సిన్ వేసుకొని జాబితా ప్రకారం వాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని, వీలుంటే మొబైల్ వ్యాక్సిన్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటి డోస్ పూర్తయిన వారు రెండో డోస్ వేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశం లో జోనల్ కమిషనర్ ప్రియాంక అల, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ ఏఏంహెచ్ఓలు, శానిటేషన్, బయోవర్సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.