నమస్తే శేరిలింగంపల్లి: మధ్యాహ్నం భోజన కార్మికుల పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొంగరి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి మండల విద్యాధికారికి మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి వినతి పత్రం అందజేశారు. 2021 సెప్టెంబరు నెల నుంచి 2022 ఏప్రిల్ మాసం వరకు వేతనాలతో పాటు మధ్యాహ్న భోజనంలో ఖర్చు చేసిన గుడ్ల బిల్లులు చెల్లించాలని కొంగరి కృష్ణ కోరారు. హై స్కూల్స్ పరిధిలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు మెస్ చార్జీలు, ప్రైమరీ స్కూల్స్ పరిధిలో మార్చి నుంచి ఏప్రిల్ వరలు మెనూ చార్జీలు ఇవ్వాలన్నారు. ప్రతీ పాఠశాలలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని, పెరిగిన గుడ్డు ధరను సర్కులర్ ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ నెల 20 న చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులకు అనుమతినివ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.