నమస్తే శేరిలింగంపల్లి: నల్ల దొరల పాలనపై పోరాటమే అల్లూరికి అసలైన నివాళి అని ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి.మధుసూదన్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా స్టాలిన్ నగర్ లో ఏఐఎఫ్ డీవై ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. మధుసూదన్ మాట్లాడుతూ నాడు దేశ స్వాతంత్రం కోసం, స్వరాజ్యం కోసం అతిపిన్న వయసులో ధైర్య సాహసాలతో విల్లంబులు చేత పట్టి మన్యం గిరిజన ప్రజలను కూడగట్టి బ్రిటీష్ తెల్ల దొరల పాలనపై విరోచితంగా పోరాడారని అన్నారు. అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో త్యాగధనుల ఫలితంగా సాధించుకున్న దేశంలో నేటి నల్ల దొరల పాలనలో దేశ సంపదను సంపన్నులకు, పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెడుతూ ప్రజలను దీనస్థితికి దిగజాస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్ర ఫలితాలు, ప్రజాస్వామ్య విలువలను కుల,మత ప్రాంతీయ భాషాద్వేషాల విషయాలయంలో కప్పివేశారని అన్నారు. ఆకలి,దారిద్ర్యం, ప్రధానంగా నిరుద్యోగం పెరిగిపోతుంటే మన నల్ల దొరలు సంపన్నులను పెంచి పోషించేందుకు ప్రజా సంపదను కొల్లగొడుతున్నదానరని వాపోయారు. వాటికి అడ్డుకట్ట వేయడానికి నాటి మన్యం సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో నేటి యువత మన నల్ల దొరల ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాలని, అప్పుడే అల్లూరి సీతా రామరాజుకు అసలైన ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ యువతుల విభాగం కన్వీనర్ ఎండి.సుల్తానా, కన్వీనింగ్ కమిటీ సభ్యులు డి. శ్రీనివాసులు, డి.కీర్తి, కె.షరీశ్, కే.రాజు, రజియా బేగం, రాజశేఖర్, కృష్ణ, నాగభూషణం, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.