నమస్తే శేరిలింగంపల్లి: చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరని ఎంసీపీఐ యూ కేంద్ర కమిటీ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి అన్నారు. మియాపూర్ స్టాలిన్ నగర్ లో శుక్రవారం వీరతెలంగాణ రైతంగా సాయుధ పోరాట వార్షికోత్సవ సదస్సులో ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడారు. భూమి భుక్తి వెట్టిచాకిరి విముక్తికై వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు. ప్రపంచం గర్వించదగేలా జరిగిన ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల సాగు భూమిని ప్రజలకు పంచడం జరిగిందన్నారు. మూడు వేల గ్రామాలు స్వరాజ్యంగా ఏర్పడ్డాయని,4 వేల మంది అమరులయ్యారని అన్నారు. ఈ పోరాటంతో వెట్టి చాకిరి విముక్తి జరిగి జాగీర్ దార్, జమీందార్, దొర పాలన రద్దయిందన్నారు. ఇంతటి మహత్తర పోరాటాన్ని మతపరంగా బిజెపి వక్రీకరిస్తుందని, తెలంగాణకు విమోచనం జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ గడ్డపై వాస్తవిక చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించలేని టిఆర్ఎస్ నాటి సాయుధ పోరాటాన్ని, చరిత్రను ప్రత్యేక తెలంగాణ పోరాటానికి వక్రీకరించి కాలాన్ని వెల్లదీస్తోందని వాపోయారు. ఇప్పటికైనా బిజెపి, టిఆర్ఎస్ లు నాటి చరిత్రను చెప్పకుంటే ప్రజలు క్షమించరని అన్నారు. ఎంసిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ఏ ఐ ఎఫ్ డి వై రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్, మైదం శెట్టి రాకేష్, ఎంసిపిఐ యు గ్రేటర్ కార్యదర్శి వి.తుకారం నాయక్, ఏ ఐ ఎఫ్ డి వై రాష్ట్ర కార్యదర్శి సుకన్య, ఏఐఎఫ్ డి వై రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, ఏ ఐ సి టి యు రాష్ట్ర అధ్యక్షుడు టి అనిల్, పి భాగ్యలక్ష్మీ, పుష్పలత, విమల , శ్రీలత, రజియా, నాగభూషణం, మధుసూదన్, రంగస్వామి, శంకర్, జి చంద్రమోహన్ రెడ్డి, డి.శ్రీనివాసులు, బి రవి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
