నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలోని అన్ని రంగాల వారి ఆర్థికాభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ మీది కుంట చెరువులో గురువారం స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మత్య్సకారుల ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేపట్టి ఆర్థిక ప్రయోజనం కలగాలని సీఎం కేసీఆర్ ఆలోచించి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. చెరువులు, కుంటలపై ఆధారపడిన కులాలు అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. చెరువులు పొంగిపొర్లుతున్నప్పుడు చేపలు సమృద్ధిగా లభిస్తున్నాయని అన్నారు. గతంలో చేపలు ఆంధ్రా ప్రాంతం నుంచి దిగుమతి అయ్యేవనీ నేడు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో మన రాష్ట్రంలోనే విరివిగా చేపలు దొరుకుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్, మత్య్స శాఖ రంగారెడ్డి జిల్లా అధికారి సుకీర్తి, మాతృశ్రీ నగర్ కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ కావూరి, మాదాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సాంబశివ రావు, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు జమీర్, నాయకులు రఘునాథ్, ఇమ్రాన్, సతీష్, ముదిరాజ్ సంఘం నాయకులు రాజు, వెంకటేష్, బాలరాజ్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.