ఓ కాలనీలోని సెప్టిక్ ట్యాంక్ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని పలువురు కాలనీ వాసులు ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగుతుండగా.. అసలు ఆ స్థలం సెప్టిక్ ట్యాంకుదే కాదని, ఐనా సదరు స్థలాన్ని కాపాడుకొని కమ్యూనిటీ కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పేర్కొంటుండటం విశేషం. స్థానికంగా చర్చనీయాంశం మారిన ఈ ఘటన మియాపూర్ మాతృశ్రీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
రూ.11 కోట్ల విలువైన స్థలం రూ.48 లక్షలకు అంటగట్టారు…
మియాపూర్‌లోని మాతృశ్రీనగర్ కాలనీలో 1994 అప్రువల్ ఐన లేఅవుట్ ప్రకారం సెప్టిక్ ట్యాంకుగా పేర్కొనబడిన స్థలాన్ని ప్రస్థుతం ప్లాట్ నెంబర్లుగా మలచి కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు కాలనీ వాసులు వాపోయారు. ఈ క్రమంలోనే సోమవారం కాలనీలోని పార్కులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 24 మంది కాలనీ వాసులు పలు అంశాలను మీడియా ముందు ఉంచారు. మాతృశ్రీనగర్ కో ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ఈసీ బాడీ పదవీ కాలం 2020 మే 14తో ముగిసిందని, ఐతే ఆ స్థానంలో కొత్త పాలకవర్గాన్ని ఏర్పటు చేశారని, అందులో కొత్తగా చేరిన ఇద్దరు వ్యక్తులు కాలనీలోని సెప్టిక్ ట్యాంకు స్థలాన్ని కబ్జా చేసేందుకు ఉపక్రమించారని అన్నారు. ప్రస్థుతం సెప్టిక్ ట్యాంకుగా కొనసాగుతున్న స్థలాన్ని ప్లాట్ నెంబర్ 1119గా పేర్కొంటు రూ.48 లక్షలకు ఒక వ్యక్తికి విక్రయించారని తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న తామందరం ప్రభుత్వ విప్ గాంధీ వద్దకు వెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేయగా, సదరు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ తంతు నేపథ్యంలో తమకు తెలియకుండా ఇలాంటి కార్యకలాపలు జరగడాన్ని ఖండిస్తూ కాలని వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన ముగ్గురు సలహాదారులు, ఒక ఈసీ మెంబర్ రిజైన్ చేశారని తెలిపారు. ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న సమాచారం, కీలక పత్రాలతో ఈ అంశాంన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేస్తామని ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న పలువురు కాలనీ వాసులు పేర్కొన్నారు.
గిట్టనివారు చేస్తున్న నిరాధార ఆరోపణలు…
సెప్టిక్ ట్యాంకు స్థలం కబ్జాకు గురవుతుందని వస్తున్న ఆరోపణలను మాతృశ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కావూరి అనిల్ కుమార్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హూడా అప్రువుడ్ లే అవుట్ ప్రకారం సదరు స్థలం ప్లాట్లుగానే గుర్తించబడిందని, ఎవరైనా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నుండి అధికారికంగా సదరు పత్రాలు తీసుకుని పరిశీలించుకోవచ్చని, నిరాధార ఆరోపణలకు చేస్తూ తమపై బురదజల్లే ప్రయత్నం తగదని అన్నారు. ఆ స్థలాన్ని ప్లాట్లుగా ఆమ్ముకునే హక్కు మాతృశ్రీ కో ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీకి ఉన్నదని, ఐనప్పటికి వారు చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయించి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్‌కు బదలాయించే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. గత మూడు పర్యాయాలుగా కాలనీ వెల్ఫేర్ అసోసేయేషన్‌ను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించి, భంగపడ్డ కొందరు వ్యక్తులు కావాలనే తమపై నిరాధార ఆరోపణలు చేస్తూన్నారని మండిపడ్డారు. కాలనీలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాల్సింది పోయి అడ్డుపడుతున్నారని, ఈ క్రమంలోనే పలు అంశాల్లో ఫిర్యాదులు చేస్తూ అసోసియేషన్‌కు అడ్డుతగలడం కాలనీవాసులు అందరు గుర్తించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తమ వైకరి మార్చుకుని కాలనీ వాసులందరి అభ్యున్నతికి సహకరించాలని, లేనియెడల ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసుకుంటూ వెళితే న్యాయపరమైన చర్యలుతీసుకుంటామని, అదేవిధంగా పరువు నష్టం దావా కూడా వేస్తామని హెచ్చరించారు.