జిల్లా పరిషత్తు హైస్కూల్ లో గణితశాస్త్ర దినోత్సవ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ జిల్లా పరిషత్తు హైస్కూల్ లో విద్యార్థిని విద్యార్థులకు గణితశాస్త్ర దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజం చిత్ర పదానికి పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బసవలింగం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం గణితశాస్త్ర ఆచార్యులు చిరంజీవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి ప్రపంచంలో గణితశాస్త్ర మూలరూపాలు ఉన్న దేశాలు భారతదేశం, ఈజిప్టు, బాబిలోనియా అని అన్నారు. భారతీయులు సున్నాకు, దశాంశ పద్ధతిని ప్రపంచం గణితానికి అందించి గణిత విజ్ఞాన శాస్త్రాభివృద్ధి వేగం పుంజుకోవడానికి కారకులైనారని అన్నారు.

మన ప్రాచీన గణిత శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, మహావీరాచార్య, శ్రీధర, పావులూరి మల్లన్న, భాస్కరాచార్యులు, ఆధునిక గణితశాస్త్రవేత్తలైన శ్రీనివాస రామానుజం, మహాలనోబిస్, నర్సింగరావు, R.C. బోస్ గణితశాస్త్రనికి విశేషమైన సేవలు అందించార‌ని అన్నారు. నేటి విద్యార్థులు రామానుజం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని గణితశాస్త్రంలో రాణించాల‌ని కోరారు. గణితశాస్త్రంలో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయ‌ని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విలువలతో కూడిన గుణాత్మక విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రధానోపాధ్యాయుడు రాజ‌శేఖ‌ర్‌, గణిత శాస్త్ర అధ్యాపకులు నరేందర్ రెడ్డి, మనోహర్, ప్రశాంత్, మంగ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here