శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిలభారత కార్మిక సంఘాల కేంద్రం (ఎ ఐ సి టి యు) రాష్ట్ర కమిటీ సమావేశాన్ని రాష్ట్ర అద్యక్షుడు తుడుం అనిల్ కుమార్ అధ్యక్షతన బాగ్ లింగం పల్లిలోని ఓంకార్ భవన్ లో నిర్వహించారు. ఇందులో భాగంగా ఇటీవల మరణించిన ప్రపంచ రచయిత, ఆదివాసి హక్కుల కోసం విశేష రచనలు చేసిన గుగువా థియాంగో, ప్రముఖ కేరళ ట్రేడ్ యూనియన్ నాయకుడు టి ఎన్ నారాయణన్, ప్రపంచంలో వివిధ దేశాల్లో యుద్ధ దాడుల్లో మరణించిన సామాన్య పేద ప్రజలకు, ప్రకృతి వైపరీత్యాల లో మరణించిన ప్రజలకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సమావేశంను ఉద్దేశించి ఎ ఐ సి టి యు జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు నర్ర ప్రతాప్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను ప్రైవేటీకరణ, సరళీకరణ నేపథ్యంలో నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం సవరణలు చేయడం, 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లు గా మార్చటం, 8 గంటల పని విదానాన్ని 12 గం లకు పెంచటం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పని గంటల పెంపు కార్మిక విద్రోహం తప్ప మరొకటి కాదని అన్నారు. కార్మిక హక్కుల కోసం సాధించిన చట్టాలను రద్దు చేసే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను రద్దు చేయాలని జూలై 9 వ తేదీన దేశ సార్వత్రిక సమ్మె ను నిర్వహిస్తున్నారని, దీన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో ఎ ఐ సి టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కంచ వెంకన్న, సంఘం రాష్ట్ర కోశాధికారి కర్ర దానయ్య, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సుంచు జగదీశ్వర్, జి. శివాని, బి. యాదగిరి పాల్గొన్నారు.