శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన మైటా దశాబ్ది వేడుకల్లో భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తో పాటు రవీందర్ యాదవ్ హాజరయ్యారు. అత్యంత ఘనంగా నిర్వహించిన మైటా దశాబ్ది వేడుకల్లో పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మలేషియాలోని తెలంగాణ వాళ్లంతా ఒకటిగా ఉంటూ ముందుకు సాగడం ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ మార్గదర్శకంలో మైటా ఏర్పాటు కావడం గొప్ప పరిణామం అన్నారు.
పదేళ్లపాటు మైటాను ముందుకు తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని దాటి మలేషియా వచ్చిన ప్రతి తెలంగాణ బిడ్డకు మైటా సేవలు అందుతుండటం గొప్ప పరిణామం అన్నారు. గత ప్రభుత్వం లాగే మైటాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అండగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధిలో మలేషియాలోని తెలంగాణ వాళ్లు కూడా భాగస్వామ్యులు కావాలన్నారు. మలేషియాలో నివసిస్తున్న తెలంగాణ వాళ్లు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మైటా దశబ్ది వేడుకలకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, పలువురు నేతలతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు.
మలేషియా లాంటి అభివృద్ధిని హైదరాబాదులోనూ మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ చేసి చూపించారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ హైదరాబాద్ ఇమేజ్ ను పెంచారన్నారు. పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను తీసుకురాగలిగారని గుర్తు చేశారు. హైదరాబాద్ ఐటి రంగంలో బెంగళూరు లాంటి నగరాలను తలదన్ని నిలవగలిగిందని కొనియాడారు. మలేషియాలోని తెలంగాణ వాదులకు బీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. మైటా మరింత ముందుకు సాగాలని రవీందర్ యాదవ్ ఆకాంక్షించారు.