- మానవత్వం చాటుకున్న బిజెపి నేత రాజ్‌జైస్వాల్
- శశిరేఖ కుటుంబానికి నెలరోజుల నిత్యావసరాలు అందజేత
నమస్తే శేరిలింగంపల్లి: రెండు చేతులు, ఒక కాలు కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న కొడుకు… రెండు పెద్ద ఆపరేషన్లతో మంచం పట్టిన భర్త… ఆత్మస్థైర్యంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఇల్లాలని లాక్‌డౌన్ రెట్టింపు కష్టాల్లోకి నెట్టేసింది. పూటగడవడమే కష్టంగా మారిన సదరు కుటుంబానికి ఓ బిజెపి నేత తోచిన సహకారం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితి న్యూ హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉండే వెంకటేష్ గతంలో టైల్స్ పని చేశేవాడు. ఈ క్రమంలో 2004 డిసెంబర్ 24న బోరబండలోని ఒక సైట్‌లో విధులు నిర్వహిస్తుండగా కరెంట్ షాక్‌కు గురైయ్యాడు. దీంతో అతడి రెండు చేతులు, ఒక కాలు పూర్తిగా కోల్పోయాడు. వెంకటేష్ బాగోగులు చూడాల్సిన అతడి తండ్రి కొమరయ్య ఆరోగ్యం సైతం దెబ్బతిని ఓపెన్ హార్ట్, బ్రెయిన్ సర్జరీ అయ్యి మంచం భారిన పడ్డాడు. దీంతో వారిద్దరి పోషణ భాద్యత వెంకటేష్ తల్లి శశిరేఖపై పడింది. ఒకవైపు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ.. మరోవైపు కొడుకు, భర్తకు అన్ని సపర్యలు చేస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న శశిరేఖను లాక్‌డౌన్ కుంగదీసేలా చేసింది.

సోషల్ మీడియా సమాచారం ద్వారా దక్కిన సాయం…
ఎవరైన తమ కష్టాలను అర్థం చేసుకుని సహకరిస్తారేమో అని ఎదురుచూస్తున్న క్రమంలో బిజెపి యువమోర్చ రాష్ట్ర నాయకుడు నందనం విష్ణుదత్ దివ్యాంగులు ఎవరైనా లాక్‌డౌన్‌లో ఇబ్బందులకు గురవుతే తోచిన సహకారం అందించేందుకు తమ బృందం సిద్దంగా ఉందని సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశాడు. దీంతో నమస్తే శేరిలింగంపల్లి ద్వారా సమాచారం అందుకున్న దివ్యాంగుడు వెంకటేష్ తమ పరిస్థితిని విష్ణుదత్‌కు వివరించాడు. విష్ణుదత్ ద్వారా వెంకటేష్ విషయం తెలుసుకున్న బిజెపి నార్త్ ఇండియా సెల్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్, స్థానిక నాయకుడు రాజ్ జైస్వాల్ చలించిపోయాడు. దీంతో శశిరేఖ కుటుంబానికి నెలరోజులకు సరిపడా సరుకులు అందజేశారు. భవిష్యత్తులో తమకు తోచిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శశిరేఖ కష్టాల్లో భాగం పంచుకోవాలనుకునే విశాల హృదయం కలిగిన వారు ఫోన్ నెంబర్ 8099734554లో వెంకటేష్‌ను సంప్రదించవచ్చు. ఈ లాక్‌డౌన్‌లో శశిరేఖ లాంటి తల్లులెందరో ఇబ్బందులు పడుతున్నారు. చుట్టు పక్కల వారు అలాంటి వారిని గుర్తించి తోచిన సహాకారం అందించాలని, లేదా రాజ్‌జైశ్వాల్ లాంటి మనసున్న మనుషులకు సమాచారం అందించి మానవత్వాన్ని నిలబెట్టుకోవాలని నమస్తే శేరిలింగంపల్లి విజ్ఞప్తి చేస్తుంది.