శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీ రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండి చెరువును తలపించేలా మారింది. చిన్న పాటి వర్షం కురిసినా రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండిపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదనీటిలో ప్రయాణించడం వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సంబంధిత శాఖలకు చెందిన అధికారులకు ఇప్పటికే ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకోవాలని, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.






