నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం ఆదివారం ఘనంగా కొనసాగింది. బొల్లారం సాయిబాబా దేవాలయ ప్రధాన అర్చకులు నాగార్జున ఆచార్యుల బృదం పర్యవేక్షణలో వైఖానస పద్ధతిలో స్థానిక భక్తులు లక్ష్మీనారాయణ నాగమణి దంపతులచే యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిపించారు. దీంతో ఆలయ పరిసరాలు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నామస్మరణతో మారుమోగాయి.
ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందం పర్యవేక్షణలో రెండవ రోజు లక్ష దీపోత్సవంలో విశాఖ శ్రీ శారదా పీఠం తెలంగాణ రాష్ట్ర ఆగమ సలహాదారు, చందానగర్ వెంకటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యులు, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణమూర్తి, కమిటి సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి తదితరులు, శిల్పాఎన్‌క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, ఆలయ సేవాదళం సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పదివేల దీపాలు వెలిగించారు. దీప కాంతుల్లో ఆలయ ప్రాంగణం భక్తులకు కనువిందు చేసింది.