నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానాలో ఆదివారం కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ డోసు పంపిణీ కొనసాగుతుందని సూపరింటెండెంట్ వరదాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో మొదటి డోసు తీసుకున్న కోవిడ్ సూపర్ స్ప్రెడర్స్ కేటగిరిలోని వారికి రెండవడోసు వ్యాక్సిన్ ఇస్తున్నట్టు తెలిపారు. 45 సంవత్సరాల వయస్సు పైబడి ఉండి, కోవాక్జిన్ ఒకటవ డోసు తీసుకొని 28వ రోజుల గడువు ముగిసిన వారికి మాత్రమే రెండవ డోసు ఇవ్వనున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ అందజేసిన జాబితా ప్రకారం వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, సదరు లిస్టులో పేర్లు ఉన్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వరదాచారి తెలిపారు. జిహెచ్ఎంసి నుంచి ఇప్పటికే సమాచారం పొందిన సూపర్ స్ప్రెడర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కోవాక్జిన్ మొదటి డోసు కోసం లేదా కోవీషీల్డ్ వ్యాక్సిన్ కోసం ఎవ్వరూ హాస్పిటల్‌కు వచ్చి ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దని వారు సూచించారు.