- వ్యాక్సిన్ చోరి ఘటనపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దల సీరియస్
- రూ.10 నుంచి 25 లక్షల దందా జరిగిందని బిజెపి నేతల ఆరోపణ
- సమగ్ర విచారణ జరిపి భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: ఒకవైపు కరోనా విజృంభనతో ప్రజలు సతమతమవుతుంటే మరోవైపు ప్రభుత్వ దవఖానాల్లో సిబ్బంది ధనదాహానికి అంతులేకుండా పోతుంది. కొండాపూర్‌లోని జిల్లా దవాఖానాలో ప్రజలకు ఇవ్వాల్సిన దాదాపు 500 పైగా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చోరికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దవాఖానాలో 50 కోవిషీల్డ్ వాయిల్స్ చోరికి గురైనట్టు దవాఖానా సూపరెంటెండెంట్ దశరథ్ స్వయంగా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తాత్కాలికంగా కోవిడ్ వ్యాక్సినేషన్ నిలిపేసిన నేపథ్యంలో వ్యాక్సిన్‌ను తిరిగి ఇవ్వాల్సిన క్రమంలో చోరి విషయం బయటపడింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ చోరిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు దవఖానా సూపరెంటెండెంట్ దశరథ్‌పై మండిపడినట్టు సమచారం.
ఆర్‌బీఎస్‌కే విభాగంలోని ఇద్దరు సిబ్బంది పనే..?
కోవిషీల్డ్ వ్యాక్సిన్ అపహరణపై గచ్చిబౌలి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లోని ఆర్‌బీఎస్‌కే విభాగం నుంచి చోరి తంతు కొనసాగినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తుంది. సదరు విభాగం హెడ్ డాక్టర్ మహెష్ ఆదీనంలో విధులు నిర్వహిస్తున్నమణి, అంజీ అనే వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీల్లో సదరు వ్యక్తుల కదలికలు నమోదైనట్టు సమాచారం. ఐతే ఒక్కో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లో బ్లాక్‌లో రూ.2 వేల నుంచి 5 వరకు విక్రయించినట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఈలెక్కన చోరికి గురైన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో రూ.10 నుంచి 25 లక్షల వరకు దందా కొనసాగిందని స్థానిక బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఐతే గతంలోను దాదాపు 130 వాయిల్స్ చోరికి గురైనట్టు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.