నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో పెప్సీకో కంపినీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన పెప్సికో హెడ్ అమర్‌జీత్ సింగ్, సీఎస్ఆర్ హెడ్ ప్రియరంజన్‌లను ప్రత్యేకంగా అభినందించారు. కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ 15 బెడ్లు, 15 ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్స్ట్రేటర్లు, ఐదు మంది వైద్య సిబ్బంది, ఒక అంబులెన్స్‌తో సాటు వైద్య పరికరాలు, మందులు, రోగులకు ఉచిత భోజనం అందించేందుకు పెప్సి కో ముందుకు వచ్చిందని, ఇతర సంస్థలు వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కొండాపూర్ ఏరియా హాస్పిటల్ సూపరెంటెండెంట్ డాక్టర్ దశరథ్ విశిష్ట సేవలు అందిస్తున్నారని, ఆయనకు వారి సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ రూరల్ డెవల్పెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, పెప్సీకో ప్రతినిధులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
