అంతరించిపోతున్న సంప్రదాయాలను కాపాడుకోవాలి – కొమిరిశెట్టి ఫౌండేషన్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా హిందూ పండుగలు నిలుస్తున్నాయని కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ పేర్కొన్నారు. సంక్రాంతి పండగ పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్తంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆనంద్ నగర్, సీ.ఆర్. ఫౌండేషన్ లో శుక్రవారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు‌. ఈ సందర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా, రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ధనూర్మాసంలో వచ్చే పండుగ సంక్రాంతి పండుగ అని, ఈ పండుగకు సమాజంలో ప్రత్యేకమైన విశిష్టత ఉందని అన్నారు. ఈ ధనుర్మాసంలో మహిళలు ఉదయాన్నే లేచి, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకొని, ఇంటి ముందు రకరకాల రంగులతో రంగవల్లులు తీర్చిదిద్ది, గొబ్బెమ్మలతో అలకరించటం మన ప్రాచీన సంప్రదాయం అని అన్నారు.

రంగవల్లుల పోటీల్లో పాల్గొన్న మహిళలు

ఈ రంగవల్లులు వేసే ప్రక్రియలో జరిగే వ్యాయామంతో మహిళలకు అనేక గైనిక్ వ్యాధులు రాకుండా ఉండటానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే పరిసరాల పరిశుభ్రతతో, ఇంటిలోకి క్రిమి కీటకాలు ప్రవేశించకుండా ఆరోగ్యంగా ఉండటంతో పాటు అందంగా ఇంటికి అలంకరణగా కూడా ఉంటాయన్నారు. పట్టణీకరణ నేపథ్యంలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మన సంస్కృతి, సంప్రదాయాలు రోజురోజుకు కనుమరుగు అవుతున్నాయని అన్నారు. మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు అందించటానికి ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ పోటీల వల్ల మహిళలలో ఉన్న సృజనాత్మకత శక్తి వెలికి తీయటానికి అవకాశం ఉందని అన్నారు. కోవిడ్ వైరస్ దృష్ట్యా ఈ సంవత్సరం జంట సర్కిళ్ల పరిధిలో పరిమిత కాలనీలలో పోటీలు నిర్వహించి, అక్కడే బహుమతులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఆయా కాలనీలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఐదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. జడ్జిలుగా డా. రజని, టి. వరలక్ష్మి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాలం శ్రీను, తన్నీర్ బేగం, గీతిక, కృష్ణ కుమారి, నజీరా, శివ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొమిరిశెట్టి ఫౌండేషన్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగవల్లుల పోటీల్లో మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here