సీఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు.. ఇందిరమ్మ క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్

శేరిలింగంప‌ల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) 6వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నగర మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం, ప్రజా సంక్షేమం, రహదారుల అభివృద్ధి, పట్టణ జీవ వైవిధ్యం వంటి కీలక అంశాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎంసీ కమిషనర్ సృజ‌న‌, జోనల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఎన్‌హెచ్ 65 (ఓల్డ్ బాంబే రోడ్) నుంచి అమీన్‌పూర్ వరకు ప్రతిపాదిత మోడల్ రోడ్ విస్తరణలో విద్యుత్ లైన్లు, డీటీఆర్‌ల మార్పిడికి ఆమోదం లభించింది. ఖైతలాపూర్ ఫ్లైఓవర్ నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్ వరకు ట్విన్ బాక్స్ బ్యారెల్, సీసీ రోడ్డు నిర్మాణం, అంబీర్ చెరువు నుంచి శ్రీనివాస కాలనీ వరకు బాక్స్ డ్రెయిన్, మయూరి నగర్‌లో బ్యాలెన్స్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరైంది. చందానగర్ పీజేఆర్ స్టేడియం అభివృద్ధితోపాటు అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

శేరిలింగంపల్లిలోని అశోక వనం పార్కులో సైబరాబాద్ అర్బన్ బయోడైవర్సిటీ సెంటర్ ఫర్ అవేర్‌నెస్, రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ (CUB-CARE) ఏర్పాటుకు కమిటీ ఆమోదం తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద ఘన వ్యర్థాల నిర్వహణ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2027 సన్నద్ధత, బల్క్ వేస్ట్ జనరేటర్ నిబంధనల అమలు, ఐఈసీ కార్యక్రమాలు, థర్డ్ పార్టీ మానిటరింగ్‌కు ఏఎస్‌సీఐ (ASCI) సాంకేతిక మద్దతు, మూడు జోన్లకు కన్జర్వెన్సీ సామగ్రి కొనుగోలు, అధికారులకు శిక్షణ, మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ వాహనాల కొనుగోలు, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు, డిజిటల్ స్టాండీలు, ఇంటరాక్టివ్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు, ఆస్పిరేషనల్ టాయిలెట్లు, కంపోస్ట్ యూనిట్లు, సెకండరీ కలెక్షన్ ట్రాన్స్‌ఫర్ పాయింట్లు (SCTPs), మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ (MRFs) ఏర్పాటుకు ఆమోదం లభించింది.

ప్రజా ఆరోగ్యం, పారిశుధ్య సేవల బలోపేతంలో భాగంగా శానిటేషన్, ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లో ఖాళీల భర్తీకి ప్రత్యామ్నాయ సిబ్బంది నియామకం, సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. అలాగే సీఎంసీ పరిధిలోని 32 ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు ప్రతిపాదనకు కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆర్థిక అంశాల కింద మే 31, జూన్ 30తో ముగిసిన నెలల ఆదాయ-వ్యయ వివరాలను కమిటీ నమోదు చేసింది. అలాగే రెండు రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (RDP) ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఎన్‌హెచ్ 65 ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి పీఎన్‌ఆర్ హిల్ వ్యూ వరకు, మియాపూర్ లోటస్ హాస్పిటల్స్ నుంచి అమీన్‌పూర్ గ్రామంలోని ఎం.జి. విగ్రహం వరకు రహదారి అభివృద్ధి పనులు ఉన్నాయి. స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టిన అన్ని అజెండా అంశాలకు ఆమోదం తెలుపుతూ, అవసరమైన చోట ప్రభుత్వం, కార్పొరేషన్, సంబంధిత అధికారుల అనుమతులతో తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here