ద‌ళితబంధు కాదు… ఎన్నిక‌ల వేళ పురుడు పోసుకున్న ద‌గాబంధు: బిజెపి ద‌ళిత మోర్చ‌

  • బిజెపి ద‌ళిత మోర్చ‌ అధ్వర్యంలో ఉత్సాహంగా డ‌ప్పు-చెప్పు కార్య‌క్ర‌మం
  • ద‌ళితుల‌కు రూ.5 వేలు పెన్ష‌న్ ఇవ్వాలంటూ శేరిలింగంప‌ల్లి త‌హ‌సిల్దార్‌కు విన‌తి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌త పార్టీ దళిత మోర్చ అధ్వర్యంలో సోమ‌వారం డప్పు-చెప్పు కార్యక్రమం నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం దళితులకు హామీ ఇచ్చిన రూ.5 వేల పెన్షన్ వెంట‌నే అమ‌ల‌య్యేలా చూడాల‌ని శేరిలింగంప‌ల్లి త‌హ‌సిల్దార్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా బిజెపి ద‌ళిత మొర్చ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కాంచ‌న కృష్ణ‌, ఐటీ సెల్ క‌న్వీన‌ర్ పీఎస్ రాహుల్‌లు మాట్లాడుతూ భారతీయ సమాజం భిన్న సంస్కృతుల సమాహారమ‌ని, ఇందులో ప్రత్యేకించి దళిత సామాజిక వర్గం పాత్ర ఎంతో విశాలమైనదని గుర్తు చేశారు. త‌మ‌ సామాజికవర్గంలోని పలు కులాలవారు వివిధ వృత్తులను తరతరాలుగా అనుసరిస్తూ సమాజ మౌలిక అవసరాలను తీర్చడంలో ముందున్నారన్నారు. ఐతే తెలంగాణలోని పరిస్థితులను గమనిస్తే, పోరాడి సాధించుకున్న మన ప్రత్యేక రాష్ట్రం లోని దళిత సామాజికవర్గాన్ని ఒక ఓటు బ్యాంక్‌గా మాత్రమే పాలకులు చూస్తున్నారు తప్ప దళితుల అభివృద్ధికి చేసింది శూన్యమ‌ని అన్నారు. ఈ పరిస్థితుల్లో దళిత డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, కాటి కాపరులకు నెల నెలా రూ.5,000/- చొప్పున పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

త‌హ‌సిల్దార్ కార్యాలయం వ‌ద్ద డ‌ప్పు ద‌రువుల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న బిజెపి నాయ‌కులు

బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలప్పుడు మాత్రమే మన పాలకులకు ‘దళిత బంధు’వులు గుర్తుకు వస్తారని విమర్శించారు. దళిత ముఖ్య మంత్రి ఎక్కడ అని, దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల పొలం ఏది అని ప్రశ్నించారు. గత వారం వనపర్తి జిల్లాలోని గాంధీనగర్‌లో ఫీజులు కట్టలేక బీటెక్ విద్యార్థిని అయిన దళిత బిడ్డ లావణ్య ఆత్మహత్య వార్త విన్నామని, లక్షల్లో అప్పు చేసి మరీ అభివృద్ధి పనులు చేయించిన ఒక దళిత కౌన్సిలర్‌కు బిల్లులు రాక వేదన పడుతున్న వార్త చ‌దివామ‌ని, తెలంగాణలో దళితులకు జరుగుతున్న న్యాయం ఇదేనా అని ప్ర‌శ్నించారు. ఇక అల్పాదాయ వృత్తుల్లో ఉన్న దళిత కుటుంబాల పరిస్థితి మరింత దయనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయ‌కులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్‌, క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ర‌వికుమార్ యాద‌వ్‌, జిల్లా నాయ‌కులు పోరెడ్డి బుచ్చి రెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్, మూల అనిల్ గౌడ్‌, కృష్ణ‌కాంత్‌, గ‌చ్చిబౌలి కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి, నాయ‌కులు మహిపాల్ రెడ్డి, ఎళ్లేష్, రాధ‌కృష్ణ యాద‌వ్‌, సుర్ణ శ్రీశైలం, చంద్ర మోహన్, లక్ష్మణ్ ముదిరాజ్, హనుమంత్ నాయ‌క్‌, భారత్ రాజ్, పద్మ, భిమని విజయ లక్ష్మి, బబ్లీ, అంజు, శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని పలు డివిజన్‌ల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, కాటి కాపరులు పాల్గొన్నారు.

డప్పు, చెప్పు కళాకారులు, కాటి కాపరులతో క‌ల‌సి తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బిజెపి నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here