నమస్తే శేరిలింగంపల్లి: రైతులను సాకుగా చూపుతూ రైతులపై కపట ప్రేమను వల్లిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ధర్నా చేపట్టడం సిగ్గుచేటని బిజెవైఎం రాష్ట్ర నాయకులు కసిరెడ్డి సింధూరఘునాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ప్రతి వరి గింజను ముఖ్యమంత్రి కేసీఆర్ కొంటామని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ప్రచారం చేయడం సరికాదన్నారు.టీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నా తో తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే అన్నారు. రైతు ధర్నాలతో పబ్బం గడుపుకోవాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారని, ప్రజలు అంతా గమనించి దుబ్బాక, హుజూరాబాద్ లో కీలెరిగి వాతపెట్టారని సింధూరఘునాథ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నాటకాలను ఇక మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రం పైన తప్పుడు ఆరోపణలు చేయడాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఖండించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరుకుందని సింధూరెడ్డి అన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి గాయి గాయి చేసినంత మాత్రాన ఫలితం ఉండదని, కేసీఆర్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కు 2023 లో తెలంగాణ ప్రజలు పంపుతారని పేర్కొన్నారు.