శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ శిల్పా ఎన్‌క్లేవ్ కాలనీలో ఉన్న లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు నవంబర్ 5వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ పలు ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి కల్యాణం, మంగళవారం రాత్రి 7 గంటలకు వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య కల్యాణం, 29వ తేదీ బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం, 30వ తేదీ గురువారం రాత్రి 7 గంటలకు శ్రీ సాయిబాబా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 31వ తేదీ రాత్రి 7 గంటలకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి వారి కల్యాణం, నవంబర్ 1వ తేదీ రాత్రి 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం, 2వ తేదీ రాత్రి 7 గంటలకు పద్మశ్రీ పురస్కార గ్రహీత, సహస్ర అవధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు దివ్య ప్రవచనం, 3వ తేదీ రాత్రి 7 గంటలకు శ్రీ శివపార్వతుల కల్యాణం, 4వ తేదీ రాత్రి 7 గంటలకు శ్రీ సువర్చల హనుమత్ కల్యాణం, 5వ తేదీ ఉదయం 10 గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, మధ్యాహ్నం 12.30 గంటలకు అన్న సమారాధన, రాత్రి 7 గంటలకు జ్వాలా తోరణం తదితర ప్రత్యేక పూజలు, కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని సూచించారు.






