నమస్తే శేరిలింగంపల్లి: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిజాంపేట్ వద్ద గల వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఆదివారం పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటేల్ త్యాగాలను మర్చిపోయిన బిజెపి ప్రభుత్వం నరేంద్రమోడీ నాయకత్వంలో పటేల్ త్యాగాలను గుర్తించి, పటేల్ గొప్పతనాన్ని దేశ ప్రజలకు చాటి చెప్పి ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ప్రముఖ స్వాతంత్ర్యసమర యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా సర్థార్ వల్లభాయ్ పటేల్ ఘనకీర్తి సాధించారని అన్నారు. హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత పటేల్ కే దక్కుతుందని కొనియాడారు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారని అన్నారు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఉన్నత బాధ్యతలను చేపట్టారని పేర్కొన్నారు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేయడంతో పాటు నెహ్రూ మంత్రిమండలిలో ఉండి అనేక విషయాలలో నెహ్రూతో విభేదించిన ధీశాలి సర్థార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. మహానుబావుని ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే తరానికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.