నమస్తే శేరిలింగంపల్లి: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని కమల నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి వినతీ పత్రం అందజేశారు. కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాలు నిలిపేయమని ఎగ్జిబిషన్ సొసైటీ సూచించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ కళాశాల సేవలను నిలిపేస్తే పేదింటి ఆడబిడ్డలు సాంకేతిక విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కమల నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలను ప్రైవేటు ఇంజనీరింగు కాలేజీగా మార్చే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేక పోతున్నామని ఎక్సిబిషన్ గ్రౌండ్ సొసైటీ చేతులెత్తేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేనిదే కాలేజీ నడపలేమని తేల్చి చేబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ఎందరో పేద విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దిన కమల నెహ్రూ కళాశాలను యధావిధిగా కొనసాగించేల ప్రభుత్వం చొరవ చూపాలని, ఒకవేల ఇంజనీరింగ్ కళాశాల స్థాపించినా పాలిటెక్నిక్ కోర్సులకు భగం కలగకుండా చూడాలని, లేనియడల ఏఐఎఫ్‌డీఎస్ తరపున పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. వినతీ పత్రం అందించిన వారిలో నాయకులు ఈ. ఉదయ్, ఎస్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.