నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్, శాంతినగర్, ఆదర్శనగర్ తో పాటు వైష్ణవి అపార్ట్మెంట్, సాయి శేఖర క్లాసిక్ అపార్ట్మెంట్, సాయి కోట అపార్ట్మెంట్, దీప్తి శ్రీ అపార్ట్మెంట్ తదితర అపార్ట్మెంట్ లలో మంచినీటికి బదులు కలుషిత నీరు సరఫరా అవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మాజీ కార్పొరేటర్, బిజెపి నాయకురాలు బొబ్బ నవత రెడ్డి అన్నారు. ఐదు రోజులుగా మంచినీటి సరఫరాలో మురుగు నీరు కలిసి కలుషితమవడంతో కాలనీలోని, అపార్ట్మెంట్ ల్లోని ప్రజలు ఆ నీటిని త్రాగడం వలన చాలామంది అనారోగ్యానికి గురయ్యారన్న విషయం తెలుసుకుని శుక్రవారం మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి కాలనీలో పర్యటించారు. సమస్యను తెలుసుకొని బాధితులను పరామర్శించారు. త్రాగు నీరు కలుషితమై ప్రజలు అనారోగ్య భారిన పడుతున్నా ప్రజాప్రతిధులు పట్టించుకోవడం లేదని, కనీసం పరమర్శించలేదన్నారు. పైప్ లైన్ లో కలుషిత నీరు ఉండటం వలన ఆరు రోజుల నుంచి తాగునీటి సరఫరా ఆగిపోవటంతో కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కలుషిత నీటి సమస్యను పరిష్కరించి త్వరగా త్రాగు నీటిని సరఫరా చేయాలని అధికారులతో చర్చించి డిమాండ్ చేశారు.