నమస్తే శేరిలింగంపల్లి: ఇజ్జత్‌నగర్ ఖానమెట్ సర్వే నెంబర్ 41/14లోని స్మశాన వాటికను ప్రభుత్వ వేలం నుంచి కాపాడి స్థానికులను అండగా నిలవానలి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారీకి మాదాపూర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధకృష్ణ యాదవ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇజ్జత్‌నగర్‌లోని వీకర్ సెక్షన్‌ను ఆనుకుని ఉన్న దాదాపు మూడు ఎకరాల ఖాలీ స్థలాన్ని స్థానికులు గత మూడు దశాబ్ధాలుగా స్మశాన వాటిక గా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. అందులో సుమారు వందల కొద్దీ సమాధులు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి స్మశాన వాటికను ఈ తెలంగాణ ప్రభుత్వం వేలం వేసేందుకు ముందుకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వేలం ఆపి స్మశాన వాటికను కాలనీ వాసులకే కేటాయించాలని ఆచారిని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆచారి జిల్లా కలెక్టర్, బల్దియా కమిషనర్‌లతో మాట్లాడుతానని హామి ఇచ్చినట్టు రాధాకృష్ణ తెలిపారు. వినతీ పత్రం సమర్పించిన వారిలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి మదనాచారి, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బాలకుమార్, కుర్మయ్య, భారతి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.