శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పనులకు గాను కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జడ్‌సీకి వినతిపత్రం అందజేయడం, పనులను నిలిపివేయడం చూస్తేనే తెరాస ప్రజా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు ఏపాటిదో అర్థం అవుతుందని శేరిలింగంపల్లి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే శేరిలింగంపల్లి నియోజకవర్గానికి అత్యధిక ఆదాయం వస్తుందని, అలాంటిది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేయడం సిగ్గు చేటని అన్నారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు అందరూ నో పేమెంట్.. నో వర్క్.. అంటూ ఆందోళన చేస్తున్నారన్నారు. ఇప్పటికే వారు జోనల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేసి ఐదు నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ జడ్సీకి వినతిపత్రం ఇచ్చారని, పనులను నిలిపివేశారని అన్నారు. దీన్ని బట్టి చూస్తేనే టిఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారుల వైఫల్యం ఎంత ఉందో ప్రజలకు అర్థం అవుతుందని అన్నారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీలో జీహెచ్ఎంసీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్య కారణం.. వరద సహాయం పేరిట రూ.10వేలను తెరాస ప్రజా ప్రతినిధులు తమ పార్టీ కార్యకర్తలకు అందించడమేనన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వరద బాధితులకు కాకుండా టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే రూ.10 వేల చొప్పున ఇచ్చారని ఆరోపించారు. నిజమైన బాధితులు మీ సేవలో అప్లయి చేసుకున్నా సహాయం ఇవ్వలేదన్నారు. ఎన్నికలు అయిన తరువాత డిసెంబర్ 7వ తేదీ నుండి సమాయం అందిస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇప్పుడు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. వెంటనే ప్రభుత్వం బాధితులకు రూ.10వేల సహాయం అందజేయాలని, లేదంటే ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంటుందని అన్నారు.